ఆపువ్వు ఈపువ్వు తెచ్చి ఉయ్యాలో
ఇంపుగా పేర్చిరె మాయమ్మ ఉయ్యాలో
కొత్త బట్టలె గట్టి ఉయ్యాలో
నగలు నట్ర బెట్టి ఉయ్యాలో
ముద్దుగా ముస్తాబు అయ్యి ఉయ్యాలో
అతివలందరూ గలిసి ఉయ్యాలో
బతుకమ్మ గౌరమ్మ అంటు ఉయ్యాలో
పాటలె పాడిరి ఉయ్యాలో
ఆటలె ఆడిరి ఉయ్యాలో
పండగే జేసిరీ ఉయ్యాలో
పండగంటేమిటి ఉయ్యాలో
బతుకు నిచ్చు పండగంటు ఉయ్యలో
బతుకు నివ్వమంటు కొలిస్తివి ఉయ్యలో
ఇదియేన పండుగా ఉయ్యాలో
ఇంతేన పండుగ ఇంతి ఉయ్యాలో
నాటి నైజాము కాలాన ఉయ్యాలో
నీ గుడ్డలూడదీసిన నాడు ఉయ్యాలో
నిన్ను నగ్నంగ ఆడమన్ననాడు ఉయ్యాలో
ఎక్కడి కెల్లిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
అన్ని తానై నిన్ను ఏలుకుంటానన్న ఉయ్యాలో
తాగివచ్చి నీ మొగుడు ఉయ్యాలో
నిన్ను తన్నినా నాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
గౌరమ్మ గౌరమ్మ అంటు ఉయ్యాలో
మమ్ము కనికరించుమంటు ఉయ్యాలో
మస్తుగా బాడినావు ఉయ్యాలో
మరి ఏమైనాదమ్మ మాయమ్మ ఉయ్యలో
పంటలె పండకా ఉయ్యాలో
పోలములే ఎండినా ఉయ్యాలో
అప్పులే కట్టలేక ఉయ్యాలో
నీ అన్నదమ్ములు ఉరేసుకున్ననాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
అమ్మ ఆకలంటు ఉయ్యాలో
అయ్యొ ఆడుకోవలసిన నీ పిల్లలుయ్యాలో
అలమిటిస్తున్న నాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
పోయిరా నాబిడ్ద అంటు ఉయ్యాలో
అత్తింటికే పంపితీవి ఉయ్యాలో
కట్నమేదని ఉయ్యాలో
కర్కషంగ గాల్చిననాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
నా తెలంగాణ నాదంటు ఉయ్యాలో
నీ బిడ్డలసువులు బాసిననాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
మన దగ్గర బడ్జెట్ లేదంటు ఉయ్యాలో
సదువు జెప్పాల్సిన సర్కారు బడులనూ ఉయ్యాలో
మూర్ఖంగ మూసిననాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
ప్రాజెక్టులు గడ్తనని ఉయ్యాలో
నీకు మారు మార్గం జూపక ఉయ్యాలో
పంటలు పండె నీ భూములను ఉయ్యాలో
పాపాత్ములు దీసుకున్ననాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ అంటు ఉయ్యాలో
గిన్నీసు బుక్కంటు ఉయ్యాలో
పైసలె పారబోసిరుయ్యాలో
అర్థం లేని ఆర్భాటం జేసిననాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
అందరూ గలిసి ఆడ వలసిన బతుకమ్మనూ ఉయ్యాలో
నీ కులము నాది గాదంటు ఉయ్యాలో
తోటి వారిని తక్కువ జేసిననాడు ఉయ్యాలో
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో
నీకష్టం నీనష్టం నీది గాదా ఉయ్యాలో
అది మర్చి నువ్వు ఉయ్యాలో
ఏవరిమిదో ఆదార పడేవు ఉయ్యాలో
వీరు వారందరూ ఉయ్యాలో
మనవారే గాదా ఉయ్యాలో
ఇంగితమె మర్చేవు ఉయ్యాలో
తెలుసుకో నా తల్లి ఉయ్యాలో
తెలుసుకొని ఆడవె మాయమ్మ ఉయ్యాలో
తేరుకో నా చెల్లి ఉయ్యాలో
తేరుకొని పాడవె మాయమ్మ ఉయ్యాలో
చేయి చేయి కలిపి ఉయ్యాలో
చప్పట్లు కొట్టండి ఉయ్యాలో
చెలిమితొ మనము ఉయ్యాలో
చేయలేనిదేమి లేదు ఉయ్యాలో
అదికదా పండుగ ఉయ్యాలో
అందరి పండుగా ఉయ్యాలో
ఆడుదాం పాడుదాం ఉయ్యాలో
***************