skip to main |
skip to sidebar
నిర్జన వారధి
"నిర్జన వారధి " - కొండపల్లి కోటేశ్వరమ్మ మొన్నటి నా ఇండియా ట్రిప్ లో హైదరాబాదు బుక్ ట్రస్ట్ లో పుస్తకాలు వెతుకుతున్నప్పుడు ఈ పుస్తకం నాకు తటస్థ పడింది. పుస్తకం పేరులోనే ఎదో నిగూడార్దం ఉందనిపించి ఎవరు రాసారబ్బా అని చూసాను. "కొండపల్లి కోటేశ్వరమ్మ" అని కనిపించింది. కొండపల్లి ఇంటి పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. కొండపల్లి బొమ్మలను దాటి నా స్మృతులు నాకు సహకరించలేదు. పక్కనే ఉన్న మా బాపుని అడిగివుంటే ఠక్కున చెప్పుండేవాడు. కానీ ఎందుకో అడగలేదు. పుస్తకం మీదున్న ఆవిడ ఛాయాచిత్రంలో అంతులేని ఆత్మస్త్థెర్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
మనకి ఏవైనా కష్టాలొచ్చినప్పుడో, ఇబ్బందులు ఎదురైనప్పుడో మనం తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు, అలాగే ఎవ్వరూ మనన్ని గమనించనప్పుడు మనం చేసే పనులే మన నిజ స్వభావాన్నీ తెలియ జేస్తాయని నా నమ్మకం. పుస్తకం వెనకట్ట మీద ఓల్గా గారు రాసిన రెండు వాక్యాలు ("ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనస్సు అర్ద్రమవుతుంది. ఆ దుఃఖం ఎంత వ్యక్తిగతమో అంత సామాజికం, రాజకీయం ... ") చదివిన తరువాత ఈ పుస్తకం తప్పక చదవాలని నిర్ణయించుకున్నాను.
ఒక బాల వింతతువు అని తెలియకుండానే మొదలైన ఆమె ప్రస్థానం కొండపల్లి సీతారామయ్య భార్యగా, సంఘ సంస్కర్తగా, నిస్వార్థ ఉద్యమ కారిణిగా, క్రియాశీల కాళాకారిణిగా, రచయిత్రిగా, భర్త తిరస్కారానికి గురైన భార్యగా, పిల్లల్ని కోల్పోయిన మాతృమూర్తిగా, మొక్కవోని పట్టుదలతో చదువుని పూర్తి చేసి తనదైన శైలిలో ఉద్యోగా బాధ్యతలు నిర్వహించి పలువురి మన్ననలందుకున్న ఉద్యోగిగా వైవిధ్య భరితమైన జీవితం ఆవిడది. పుస్తకం చదివిన మనసున్న వారికి కళ్ళు చెమర్చక తప్పవు.
మూడు ఉద్యామాలల్లో (సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టొద్యమం) పాల్గొని వాటికి పట్టుకొమ్మగా నిలిచి తన ముందు తరానికి, తన తరువాతి తరానికి వారధిగా నిలిచి ఆ వారధి పై నుండి తన అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్లిపొతే నిర్జన వారధిగా మిగిలారని అర్ధమౌతుంది.
మనిషి జీవితం కష్టసుఖాల సంగమం అయితే ఆ రెండింటిని సమంగా స్వీకరించగల స్దితప్రజ్ఞత చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు. ఆ స్దితప్రజ్ఞతకు నిలువుటద్దం కోటేశ్వరమ్మ గారు.
స్త్రీలు క్రియాశీల రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి పాత్రను నిర్వహించగలరో, వారి రాజకీయ బాంధవ్యాన్ని నిర్వచించడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. చదువు,ఉద్యోగం ఒక స్త్రీకి ఎంత అవసరమో, కష్ట కాలంలో హఠాతుగ్గా అందరు తనని ఒంటరిని చేసినప్పుడు ఆ చదువు ఉద్యోగం ఎలా అండదండలవుతాయో చెప్పడానికి ఆవిడ జీవితం ఒక చక్కని ఉదాహరణ. చదువు ఉద్యోగంతో పాటు ఆత్మగౌరవం,ఆత్మాభిమానం ఎంత అవసరమో చక్కగా చాటి చెప్పే పుస్తకం ఇది.
ఈ పుస్తకంలో ఆవిడ జీవిత స్మృతులతో పాటు ఆవిడకి ఆదర్శప్రాయమైన ఆనాటి నాయకులపై, సాహిత్యం పై కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం నుండి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, మార్పును అభిలషించే సహృదయులు, ఆ పరంపరలో ముఖ్యమైన మాతృక పోషించే నాయకులు ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు. ఓల్గా గారన్నట్టు ఈ పుస్తకం విలువైన పుస్తకం, విలువలు నేర్పే పుస్తకం .
No comments:
Post a Comment